Mathu Vadalara 2 | టాలీవుడ్ యువ నటులు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2). బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. క్రైమ్ కామెడీగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
#MathuVadalara2
Streaming this Friday onwards on #Netflix #SriSimhaKoduri #FariaAbdullah #Sathya pic.twitter.com/uxOAFNbGeg— Telugu Television News (@TeluguTvExpress) October 9, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బాబూమోహన్ (శ్రీసింహా), యేసు (సత్య).. ఇద్దరికీ డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడటంతో రోడ్డుమీద పడతారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి మొత్తానికి హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా ఉద్యోగాలు సంపాదిస్తారు. కిడ్నాపుల్ని ఛేదించడం, నిందితుల్ని పట్టుకోవడం వీళ్ల పని. ఆ పనిలో ఇద్దరూ పూర్తిగా ఆరితేరిపోతారు. జీతం డబ్బులతో బతకడం కష్టమై, అప్పుడప్పుడు చేతివాటం ప్రదర్శిస్తూ.. కొద్ది మొత్తంలో డబ్బుని కూడా తస్కరిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కొన్ని రోజులకు వాళ్లు చేస్తున్న పనిపై వాళ్లకే చిరాకేస్తుంది. ‘ఈ అరాకొరా ఆదాయంతో ఎన్నాళ్లు బతకడం.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి’ అని నిశ్చయించుకున్నారు. సరైన సమయంలో రెండుకోట్ల లావాదేవీలతో ముడిపడిన ఓ కిడ్నాప్ కేసు వీళ్ల దగ్గరకి వస్తుంది. ఆ కేసును అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఆ రెండు కోట్లు కొట్టేయాలనే ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. అయితే.. ఆ కిడ్నాప్‌కి గురైన యువతి అనూహ్యంగా వీళ్ల కారులోనే శవమై కనిపిస్తుంది. ఈ దారుణం చేసిందే వీళ్లే అని రుజువు చేసేలా ఓ వీడియో కూడా బయటపడుతుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? అసలు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు? ఈ కేసు నుంచి ఇద్దరూ ఎలా బయపడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.