Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తి నేపథ్య చిత్రం ‘ఇరుముడి’ నుంచి ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యప్ప పడిపూజలు, భజనలు జరిగినా ఖచ్చితంగా వినిపించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రైవేట్ భక్తి గీతం ‘మల్లెపూల పల్లకి’ (విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి) పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారు. ఈ వార్తను చిత్ర సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ఖరారు చేశారు.
అయ్యప్ప భక్తులకు ఎంతగానో ఇష్టమైన ‘మల్లెపూల పల్లకి’ భజన పాటను సినిమాలో పెట్టాలని అభిమానుల నుండి, భక్తుల నుండి భారీగా డిమాండ్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ స్పందించి, ఈ ఐకానిక్ సాంగ్‌ను రీమిక్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ తన ఎక్స్ ఖాతాలో ‘విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు’ అంటూ పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రవితేజ మార్క్ ఎనర్జీకి, ఈ పవర్ఫుల్ మాస్ డివోషనల్ సాంగ్ జతకావడంతో థియేటర్లలో ప్రేక్షకులకు, భక్తులకు గూస్బంప్స్ రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.