‘ఏదో ఒక వృత్తికి పరిమితం అయిపోకుండా కొత్త విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. పాఠశాల రోజుల నుంచే నాకీ అలవాటు ఉంది’ అని చెప్పింది అచ్చతెలుగందం శ్రీలీల. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ ఆఫర్లతో సత్తాచాటుతున్నది. రవితేజ సరసన ఈ భామ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. స్కూల్ రోజుల నుంచే ఏదో ఒక కొత్త స్కిల్‌ను నేర్చుకోవడం అలవాటైందని, నటిగా ఇంత బిజీగా ఉన్నా తన వైద్య విద్యను మాత్రం అశ్రద్ధ చేయడం లేదని శ్రీలీల చెప్పింది.
‘స్కూల్ రోజుల్లోనే నేను డ్యాన్స్, వీణ, స్మిమ్మింగ్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించా. సెలవు రోజుల్లో కూడా మా పేరెంట్స్ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తుండేవారు. రోజంతా ఖాళీగా ఉన్న రోజులు చాలా తక్కువ. ఇప్పుడు కూడా ఓవైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే మెడిసిన్ చేస్తున్నా. రెండు భిన్న వృత్తుల్ని బ్యాలెన్స్ చేయడం ఓ సవాలు’ అని చెప్పింది. అందరినీ నవ్వించడం అంటే తనకు ఇష్టమని, తాను చేసే సినిమాలు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటానని శ్రీలీల పేర్కొంది.