Actor | ఇటీవల ఇండస్ట్రీలో విషాద సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరాఠీ సినిమా, టెలివిజన్, నాటక రంగాల్లో గుర్తింపు పొందిన నటుడు తుషార్ ఘడిగాంకర్ ఈ రోజు ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న తన అద్దె ఇంట్లో మృతదేహంగా కనిపించారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. ప్రాథమిక సమాచారం మేరకు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు.పోలీసుల అందించిన వివరాల ప్రకారం, రామ్ మందిర్ రోడ్లో ఉన్న ఒక నివాసం నుంచి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ రావడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తుషార్ అపస్మారక స్థితిలో అవచేతనంగా నేలపై పడి ఉన్నారు. వెంటనే అతన్ని సమీపంలోని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తుషార్ ఘడిగాంకర్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా అతనికి వినోద రంగంలో సరైన అవకాశాలు లభించకపోవడం, అలాగే ఆర్థిక సమస్యలు, తీవ్ర మద్యం అలవాటు వంటి కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇంట్లో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల నుండి వాంగ్మూలాలు తీసుకున్నారు.
తుషార్ ఘడిగాంకర్, మరాఠీ సినిమా, టెలివిజన్ మరియు నాటకరంగాలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా “సంగీత్ బిబాత్ అఖ్యాన్” అనే ప్రఖ్యాత సంగీత నాటకంలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ “ఘంటా నాద్ ప్రొడక్షన్” బ్యానర్ కింద మ్యూజిక్ వీడియోలను కూడా రూపొందించారు. తుషార్ మృతిని ఆయన స్నేహితుడు అంకుర్ విఠల్‌రావ్ వాధవే ధృవీకరించారు. తుషార్ చాలా రోజులుగా మానసికంగా బాధపడుతున్నాడు అని పేర్కొన్నారు. ఇతను బాహుబలి చిత్రంలో కూడా నటించాడు.