ముముక్షోర్నేతి నేతి వాక్యేన
బ్రహ్మ సద్భావో బోధ్యతే!
భ్రాంతి నివృత్తా వాత్మా స్వయం ప్రకాశతే!
(విచారబిందు ఉపనిషత్తు)
నేతి నేతి అంటే ‘ఇది కాదు – ఇది కాదు’ ఈ మాటతో ముముక్షువు బ్రహ్మమును తెలుసుకోవాలి. భ్రాంతి తొలగిపోగానే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఈ ఉపనిషత్ వాక్యాన్ని కింది వృత్తాంతం చక్కగా వివరిస్తుంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయం అది. ఒక ప్రాంతంలో తపస్సంపన్నులైన మునుల ఆశ్రమం కనిపించింది. అక్కడ వేదాధ్యయన విద్యార్థులు ఉన్నారు. విష్ణు స్వరూపుడైన రామచంద్రుడు రాబోతున్నాడని ఆ మునిపల్లె పొంగిపోయింది. రాముడు రానే వచ్చాడు.
ఆశ్రమవాసులు సీతారామలక్ష్మణులకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత మగవాళ్లంతా ఒకవైపు, ఆడవాళ్లంతా ఒకవైపు ఆసీనులయ్యారు. కాసేపటికి ఓ మునిపత్ని అటుగా వచ్చి.. సీతమ్మ పక్కన చేరి కూర్చున్నది. ఆమెకు రామయ్యను కన్నులారా దర్శించుకోవాలని ఆరాటం. కానీ, రాముడు ఎవరో తెలియదు.
సీతమ్మతో ‘రామచంద్రుడు ఎవరమ్మా! కాస్త చూపించవూ?’ అని అడిగింది. కానీ, సీతమ్మలాంటి మహాసాధ్వి రాముణ్ని నేరుగా ఎలా చూపిస్తుంది? చూపించదు కదా! మునిపత్నికి పెద్ద చిక్కే వచ్చింది. ఇలా అయితే పని కాదనుకొని.. ఆవిడే ఒక్కొక్కరి వైపు వేలు చూపుతూ… ‘ఆయన రాముడా.. ఆయన రాముడా!’ అని అడగటం మొదలుపెట్టింది.
సీతమ్మ కాదన్న కొద్దీ… ఒక్కొక్కరినీ చూపుతూ అడగసాగింది. చివరికి నారచీరలు, ధనుర్బాణాలు ధరించిన వ్యక్తికేసి వేలు చూపి.. ‘ఆయన రామచంద్రుడా?’ అని అడిగింది. సీతమ్మ సిగ్గుపడుతూ తల ఊపింది. రాముణ్ని దర్శించుకున్న మునిపత్ని.. సీతమ్మకూ నమస్కరించింది. ఈ ఉదంతంలో పరబ్రహ్మాన్ని తెలుసుకునే మార్గం గోచరమవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటీ తొలగించుకుంటూ పోతే మన అన్వేషణ చివరికి ఒక దగ్గర ఆగిపోతుంది. అదే పరతత్వాన్ని చేరుకుంటుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ