Sukumar -Devi | టాలీవుడ్ దర్శకుడు సుకుమార్– సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణం ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి ఇండస్ట్రీ హిట్స్ వరకు చేరి తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన ముద్ర వేసింది. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ఇచ్చిన సంగీతం అనేక సందర్భాల్లో సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అందుకే ఈ కాంబోకు అభిమానుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో సుకుమార్ పూర్తి స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్తోనే ప్రయాణించడం విశేషం. వీరిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, కథను సంగీతంతో మరింత ఎమోషనల్‌గా ఎలివేట్ చేసే తీరు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడే అవకాశాలున్నాయంటూ ఫిలిం నగర్లో జోరుగా చర్చ సాగుతోంది.
ముఖ్యంగా ‘పుష్ప-2’ నిర్మాణ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు దేవిశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, అందుకే కొన్ని భాగాలకు ఇతర సంగీత దర్శకుల సహాయం తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. ఈ పరిణామం దేవిశ్రీ ప్రసాద్‌ను అసంతృప్తికి గురిచేసిందని, ఆ బాధను ఆయన ఓ ఈవెంట్లో పరోక్షంగా వ్యక్తం చేశారనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు అదే చర్చ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే తదుపరి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడిని తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతుండటం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవిశ్రీ పూర్తి స్థాయిలో సంగీతం అందించలేకపోయారని, అందుకే ఆ బాధ్యతలను థమన్‌కు అప్పగించారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకప్పుడు వరుసగా దేవిశ్రీతో పనిచేసిన పలువురు స్టార్ దర్శకులు ఇప్పుడు ఇతర సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపుతుండటంతో.. సుకుమార్ కూడా అదే దారిలో వెళ్తారా అనే ఆసక్తి నెలకొంది.అయితే ఈ ప్రచారాల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై విశ్వసనీయ వర్గాలు మరో కోణాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని సమాచారం. కథ పూర్తిగా సిద్ధం కాకముందే సంగీత దర్శకుడిని ఫైనల్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.