Manchu Vishnu | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నటుడు మంచు విష్ణు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనికి కారణం అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న ఒక సినిమాలో కన్నప్ప డైలాగ్ ఉండడమే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వస్తున్న తాజా చిత్రం’సింగిల్’ (Single). ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తుండగా.. కేతికా శర్మ, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మే 09 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఇందులో పలువురు సినీ ప్రముఖుల ఫేమస్ డైలాగులను వారి సినిమాలను ట్రోల్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.
ముఖ్యంగా, మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రంలోని ‘శివయ్య’ అనే డైలాగ్‌తో పాటు, అలాగే ‘మంచు’ అనే పదాన్ని కూడా సింగిల్ ట్రైలర్లో ఉపయోగించారు. దీంతో ఈ విషయంపై మంచు విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా, రాబోయే తమ సినిమాను ట్రోల్ చేసేలా ఉన్న ఈ డైలాగులపై ఆయన గీతా ఆర్ట్స్ మరియు చిత్ర నిర్మాతలపై ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మరోవైపు సింగిల్ ట్రైలర్ విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా, హీరో శ్రీ విష్ణు స్పందిస్తూ.. కన్నప్ప డైలాగ్ ఒక్కటే కాదని మరికొంతమంది హీరోలు, సినిమాల ప్రస్తావన కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు. అయితే ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వివాదాస్పద అంశంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు, శ్రీ విష్ణు, కేతికా శర్మ జంటగా నటించిన ‘సింగిల్’ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.