‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాయి. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్లు స్పై, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకున్నాయి. దర్శకద్వయం రాజ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్లో మూడో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ గురించి మనోజ్బాజ్పాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ సిరీస్ను మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘రెండో భాగం పూర్తయిన చోటే మూడో భాగం మొదలవుతుంది. ఎక్కువ శాతం ఈశాన్య భారతంలో చిత్రీకరణ జరుపబోతున్నాం. రెండు సీజన్ల కంటే సాంకేతికంగా, వ్యయపరంగా భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. నేను పోషించిన శ్రీకాంత్ తివారీ పాత్ర మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆయన పిల్లలు పెద్దవాళ్లవుతారు. దేశం తాలూకు సమస్యలను ఆయన ఎలా పరిష్కరించాడన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అన్నారు.