ఆయన సినిమాల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఏ పాత్ర పోషించినా కొంగొత్తగా అనిపిస్తుంది. బాక్సాఫీస్ రేసుకు సంబంధం లేకుండా విలక్షణ నటుడు అని నిరూపించుకున్నాడు మనోజ్ బాజ్‌పాయ్. ఇప్పుడు, ఓటీటీ సూపర్‌స్టార్‌గా సత్తా చాటుతున్నాడు. సినిమాలైనా, వెబ్‌సిరీస్‌లైనా ఆయన ఉన్నాడంటే రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ ఖాయం.ఫ్యామిలీమ్యాన్ జంట సిరీస్‌లతో ఇంటింటికీ పరిచయమైన మనోజ్ బాజ్‌పాయ్ ఓటీటీకి థ్యాంక్స్ చెబుతున్నాడు.
ఒక చిన్న సినిమాతో నా జర్నీ మొదలైంది. నాకు లభించిన పాత్రలు నటుడిగా న న్ను ప్రత్యేకంగా చూపించాయి. అయితే, ఓటీటీతో నా గ్లామర్ మరింత పెరిగిందేమో అనిపిస్తున్నది. అదే నన్ను నేషనల్ స్టార్‌ని చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన నా సినిమాలు, వెబ్ సిరీస్‌లకు విశేష ఆదరణ లభించడంతోనే ఇది సాధ్యమైంది. ఒక మంచి ప్రాజెక్టులో భాగం కావడం వల్ల మనకూ మంచిపేరు వస్తుందనడంలో సందేహం లేదు.
ఓటీటీ రాకతో నటులకు బాక్సాఫీస్ టెన్షన్ తప్పింది. అంతకుముందు ఒక యాక్టర్ అదృష్టం ఆ చిత్రం వసూలు చేసే కలెక్షన్ల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఓటీటీలో ప్రతిభే గీటురాయిగా మారింది. ప్రయోగాత్మక చిత్రాలు, వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కుదిరినా.. సినిమా బాగోక పోయినా, ఎపిసోడ్ సాగదీతగా అనిపించినా ఇక్కడ ప్రేక్షకుడు సింపుల్‌గా స్కిప్ చేసేస్తాడు.
కేవలం ఈ తరహా పాత్రలు మాత్రమే చేస్తాను అంటే నటులు అనిపించుకోలేరు. విభిన్న తరహా పాత్రలు పోషించినప్పుడే మనలోని ఆర్టిస్ట్ బహిర్గతమవుతాడు. సంక్లిష్టమైన వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్లు పోషించడాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. దీనికి పెద్దగా కసరత్తు చేయాల్సిన పనిలేదు. ఈ తరహా వ్యక్తులు దైనందిన జీవితంలో మనకు తారసపడుతూనే ఉంటారు. వారిని పరిశీలించడం ద్వారా నటుడిగా ఎంతో నేర్చుకోవచ్చు.
నేను పోషించిన వాటిలో ఏ పాత్ర ఇష్టమంటే చెప్పడం కష్టమే! కథ, నా పాత్ర ఈ రెండు నచ్చితేనే సినిమా ఒప్పుకొంటాను. అలాంటప్పుడు ప్రత్యేకంగా నచ్చే రోల్స్ ఏముంటాయి? కానీ, 2017లో విడుదలైన ‘గలీ గులియన్’ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా చాలెంజ్‌తో కూడుకున్నది అనిపించింది. నా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపింది. షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్ర నన్ను చాలా రోజులు ఇబ్బందిపెట్టింది. ఒక్కోసారి
నరాలు తెగిపోతున్నాయా అన్న ఉత్కంఠకు గురయ్యేవాణ్ని.
నేను నటుడిగా రాణిస్తున్నానంటే అందుకు ప్రధాన కారణం రంగస్థలం నా మొదటి మెట్టు కావడమే. స్టేజ్‌మీద గడించిన అనుభవం నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రేక్షకులను కట్టిపడేయడం రంగస్థలం గొప్పదనం. అలా ప్రేక్షకులను వశపరుచుకోవాలంటే నటుడు ఆ పాత్రలో ఎంతగా లీనమవుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అభ్యాసమే యాక్టర్‌గా నన్ను ముందుకు నడిపిస్తున్నది.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘గుల్మొహర్’ చిత్రంలో ఆ తరం మేటినటి షర్మిలా ఠాగూర్‌తో నటించే అవకాశం వచ్చింది. అలాంటి లెజెండరీతో కలిసి పనిచేస్తానని ఎన్నడూ ఊహించలేదు. నా చిన్నప్పుడు ఆమె సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూసేవాణ్ని. మా అమ్మానాన్న కూడా షర్మిలాజీ పెద్ద అభిమానులు. ‘గుల్మొహర్’ షూటింగ్ సమయంలో ఈ విషయాలన్నీ ఆమెతో షేర్ చేసుకున్నా. ఎంతగానో సంతోషించారు.