Mankatha Re Release | తమిళ స్టార్ నటుడు అజిత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మంకత్తా’ (Mankatha). ఈ సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అజిత్ అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందిస్తూ, ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
అజిత్ 50వ చిత్రంగా వచ్చిన ‘మంకత్తా’ కోలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ హై-స్టేక్ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్ నటన, గెటప్ మరియు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అయితే ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అజిత్‌తో పాటు అర్జున్ సర్జా, త్రిష, రాయ్ లక్ష్మి, అంజలి, ఆండ్రియా వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.