‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంచు విష్ణు తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ‘మా’లో 950 మంది సభ్యులున్నారని..ఈ సంఖ్య ఐదువేలకు చేరి శక్తివంతమైన అసోసియేషన్‌గా మారాలన్నారు. ‘మా’ ఎన్నికల్లో స్థానికులు, స్థానికేతరులు అన్నది సమస్యే కాదన్నారు. తన సొంత డబ్బులతో ‘మా’ భవనాన్ని కట్టిస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో ఇళ్లు ఇప్పిస్తామని చెప్పారు. ‘మా’లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా’ యాప్ ద్వారా పోర్ట్‌ఫోలియోలు సృష్టించి నిర్మాతలు, దర్శకులకు సిఫారసు చేస్తామన్నారు. ప్రతి సభ్యుడికి ఉచిత ఆరోగ్య బీమా..ఈఎస్ఐ..హెల్త్‌కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వృద్ధ కళాకారులకు అందిస్తున్న ఆరువేల పెన్షన్‌ను పెంచే ఏర్పాటుతో పాటు కొత్తగా ‘మా’లో సభ్యత్వం తీసుకునే వారికి 75 వేలకే మెంబర్షిప్ ఇస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల సీఎంలను కలిసి సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని విష్ణు తన మేనిఫెస్టోలో వెల్లడించారు.