Manchu Manoj | తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న వేళ ఆయన స్మారక స్థలం పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మే 30 వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు చూసిన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచిగా నిలిచిన మహానుభావుడి స్మారక ప్రాంగణం పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తాచెదారంతో నిండిపోవడం అందరినీ కలచివేసింది. మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన స్మారక స్థలం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించడంతో సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికున్న రోజుల్లో గురువుగా గౌరవించినవారు, ఆయన వద్ద నుంచి అవకాశాలు పొందినవారు, ఆయన సేవలను కొనియాడినవారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పరిశ్రమ పెద్దలు కనీసం వర్ధంతి రోజునైనా స్మారక స్థలాన్ని సందర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దృశ్యాలు చూసిన నటుడు మంచు మనోజ్ వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను చూసి చలించిన ఆయన, తన షూటింగ్ కార్యక్రమాలను పక్కనపెట్టి శనివారం ఉదయమే అనుచరులతో కలిసి మొయినాబాద్ చేరుకున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు తాము శుభ్రపరిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, మరోసారి స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెత్త తొలగించడం, ముళ్లపొదలు నరికివేయడం వంటి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
మనోజ్‌తో పాటు దర్శకుడు సాయిరాజేష్ బృందం కూడా ఈ కార్యక్రమంలో భాగమైంది. దాసరి స్మారక స్థలాన్ని మళ్లీ పరిశుభ్రంగా మార్చేందుకు అందరూ సమిష్టిగా కృషి చేశారు. వారి చొరవను చూసి స్థానికులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా స్పందించింది. వివాదాలకు దూరంగా సమస్య పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రతినిధులను అక్కడికి పంపించింది. మంచు మనోజ్ బృందం, గీతా ఆర్ట్స్ ప్రతినిధులు కలిసి వేగంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. తక్కువ సమయంలోనే స్మారక ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చి పూర్వ వైభవం తీసుకురావడంలో విజయం సాధించారు.పనులు పూర్తయిన అనంతరం మంచు మనోజ్ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి దాసరి నారాయణరావు విగ్రహం, సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు అపారమైన సేవలు అందించిన మహానుభావుడి జ్ఞాపకాలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నట్లు సమాచారం.