‘గజపతివర్మ లాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ఉద్వేగపూరితమైన ఈ పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది.’ అని మంచు మనోజ్ అన్నారు. ఆయన, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘కొన్ని కారణాలవల్ల తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా. ఇన్నాళ్లకు ‘భైరవం’ చేశా. ఇది గొప్ప ఎమోషనల్ మూమెంట్. ఈకథలో ప్రాముఖ్యత లేని పాత్ర ఉండదు. అందరూ అద్భుతంగా చేశారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా, షూటింగ్‌కి మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం.
సాంగ్ షూట్ టైమ్‌లో రోహిత్ ఇంట్లో ఓ విషాదం జరిగింది. అయినా తను షూటింగ్‌కి ఇబ్బంది కలగకూడదని సాంగ్‌ని ఫినిష్ చేసి వెళ్లారు. రియల్లీ హాట్సాఫ్. ఆ విషయంలో అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచారాయన.’ అని గుర్తుచేసుకున్నారు మంచు మనోజ్. ‘అహం బ్రహ్మాస్మి’ తాను సోలోగా వద్దామని చేసుకున్న కథ అని, కొన్ని కారణాలవల్ల అది కుదర్లేదని, ‘భైరవం’, ‘మిరాయి’ దేవుడు ప్లాన్ చేసిన సినిమాలని మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇంకా చెబుతూ ‘ ‘భైరవం’ సినిమాకి తమిళ ‘గరుడన్’ మాతృక. అయితే.. ‘గరుడన్’ చూసినవారు కూడా ‘భైరవం’ చూసి సర్ప్రైజ్ ఫీలవుతారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. పిల్లలకోసం ఓ సినిమా నిర్మించాలని ఉంది’ అని తెలిపారు మంచు మనోజ్.