Manchu Lakshmi | టాలీవుడ్లో నటిగా, నిర్మాతగా తనదైన స్థానం సంపాదించుకున్న మంచు లక్ష్మీ ఎప్పుడూ కూడా స్ట్రైట్‌గా మాట్లాడుతూ ఉంటుంది . ఎలాంటి ప్రశ్న అయినా ధైర్యంగా ఎదుర్కొనే ఆమె, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్‌పై అనవసర వ్యాఖ్య చేసిన సీనియర్ జర్నలిస్టుకు క్షమాపణ చెప్పించే వరకు వదల్లేదు. “మహిళ ఏం ధరిస్తుందో, ఎలా ఉంటుంది అనేది ఆమె స్వేచ్ఛ” అంటూ మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసాయి. తాజాగా ‘పోడ్కాస్ట్ – ది మేల్ ఫెమినిస్ట్’లో మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఫిల్టర్ లేకుండా, తన కెరీర్లో విన్న, చూసిన, అనుభవించిన విషయాలను ఆమె బహిరంగంగా వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, ఒత్తిడుల గురించి మాట్లాడుతూ, “నేను స్టార్ కిడ్నని ఎలాంటి సమస్యలు రాలేదనుకోవడం చాలా పెద్ద పొరపాటు. కొన్ని సంఘటనలు విన్న ప్రతిసారీ రాత్రిళ్లు ఏడ్చేదాన్ని” అని చెప్పి ఆమె భావోద్వేగానికి గురైంది. తన చుట్టుపక్కల విన్న వేధింపుల ఘటనలు కూడా తనపై మానసిక ప్రభావం చూపాయని తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో సంప్రదాయం పేరుతో మహిళలపై అనవసర ఒత్తిడి ఉంటుంది. ఒక సీన్లో కాస్త బొడ్డు కనిపించినా విమర్శలు మొదలవుతాయి. అది ఆర్ట్ డిమాండ్ అయినా మహిళల శరీరాన్ని తప్పుగా చూసే మనస్తత్వం ఉంది అని వ్యాఖ్యానించారు.
నార్త్ ఇండస్ట్రీ అనుభవం గురించి మాట్లాడుతూ అక్కడ ప్రొఫెషనలిజం ఎక్కువ. వ్యక్తిగత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు. పని అంటే పని అని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో మహిళలపై జరిగే ట్రోలింగ్‌పై మండిపడిన ఆమె… ప్రతి మహిళకు తన శరీరంపై నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం తప్పేం కాదు. కానీ మన సమాజం మహిళలు మాట్లాడటానికి కూడా భయపడే వాతావరణం సృష్టించింది అని విమర్శించారు. హాలీవుడ్లో పనిచేసిన అనుభవం గుర్తుచేసుకుంటూ ..అక్కడ సమయ పాలన, ప్రైవసీ గౌరవం, సమాన అవకాశాలు ఇవన్నీ బాగా కనిపిస్తాయి. టాలీవుడ్ ఇంకా ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి అని చెప్పారు. అమెరికాలో స్కూల్ స్థాయిలోనే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. మన దేశంలో ఈ విషయం గురించి మాట్లాడటానికే భయపడతారు. ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది అని అభిప్రాయపడ్డారు. మంచు లక్ష్మీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.