ఉగాది రోజున గద్దర్ సినీ పురస్కారాల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు సినీరంగంలోని అన్ని విభాగాలకు ఈ అవార్డులను అందిస్తామన్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాకుండా దేశంలోని వివిధ భాషా చిత్రాలకు హైదరాబాద్ కేంద్రంగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్‌ను ప్రపంచ సినీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఓ కార్యచరణను రూపొందించుకొని ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్, అగ్ర నిర్మాత దిల్‌రాజు, గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మణిశర్మ తదితరులు పాల్గొన్నారు.