23 Movie | మల్లేశం, 8 ఏఎమ్ మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాజ్ రాచకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న మరో సంచలన చిత్రం 23. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.! అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రాబోతుంది. తేజ, తన్మయ, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. నేడు మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 1991లో జరిగిన చుండూరు మారణకాండ ఘటన(1991 Tsunduru massacre)తో పాటు, 1993 చిలకలలూరిపేట బస్సు దహనం(1993 Chilakaluripeta bus Burning Incident), 1997 హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి (1997 jubliee hills car bomb blast) ఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో చనిపోయిన వారి కథ ఒక లాగే ముగియగా.. ఈ ఘటనలకు పాల్పడిన హంతకుల కథ ఏం అయ్యింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. చూస్తుంటే దర్శకుడు రాజ్ రాచకొండ ఈసారి ఎదో సంచలనం సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది.