తిరువనంతపురం : తాను ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను మళయాళం నటుడు విజయ్ బాబు తోసిపుచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తనపై ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని, ఆమెను తేలికగా విడిచిపెట్టనని అన్నారు. తాను బాధితుడినని, దేశ చట్టాలు ఆమెను కాపాడినా బాధపడుతున్నది తానని ఆయన ఫేస్బుక్ లైవ్ వేదికగా పేర్కొన్నారు.
తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ పంచుకోవచ్చని అయితే ఆమె కుటుంబాన్ని దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తాను కేవలం తన తల్లి, భార్య, సోదరి, స్నేహితులకు మాత్రమే జవాబుదారీనని పేర్కొన్నారు. విజయ్ బాబు దోషి కాడనే చిన్న వార్తతో తాను ఈ వ్యవహారాన్ని ముగించదలుచుకోలేదని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ ఆడిషన్‌కు రాగా ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేశానని, అయితే క్యాస్టింగ్ కౌచ్ అంటూ చేస్తున్న ఆరోపణల్లో తాను బాధితుడిగా మారానని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను కుంగుబాటుకు లోనయ్యానని చెబుతూ ఆమె మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టిందని, డిసెంబర్ నుంచి మార్చి 2021 వరకూ ఆమె మెసేజ్‌లన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పారు. 400 స్క్రీన్షాట్లు ఉన్నాయని, ఆమె చేసిన లైంగిక దాడి సహా ఇతర ఆరోపణలపై తన వద్ద ఉన్న రికార్డులే బదులిస్తాయని పేర్కొన్నారు.