Edavela Babu | మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. చాలామంది ప్రముఖ నటీనటులు, దర్శకులు, రాజకీయ నేతలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యాచారం కేసులో మలయాళ నటుడు, అమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి ఇడవేల బాబు (Edavela Babu) అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబుని ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా అరెస్ట్ చేసింది.
ఓ మహిళా నటి ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఇడవేల బాబుపై ఫిర్యాదు చేసింది. ఇడవేల తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపించింది. అమ్మ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు బాబుని అదుపులోకి తీసుకున్నారు.
నటిపై రేప్ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్ట్
మరోవైపు ఓ నటిని రేప్ చేశారన్న ఆరోపణల కేసులో కేరళ అధికార పార్టీ ఎమ్మెల్యే, నటుడు ముఖేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను బెయిల్‌పై విడుదల చేసింది. అంతకు ముందు సిట్ హెడ్‌క్వార్టర్స్‌కు దర్యాప్తు నిమిత్తం ఉదయం 9.45 గంటలకు వెళ్లిన ఆయనను అధికారులు మూడున్నర గంటల పాటు ప్రశ్నించి, అనంతరం అరెస్ట్ చేశారు. అయితే ఆయనపై దాఖలైన కేసులో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ జడ్జి ఈ నెల 5న బెయిల్ మంజూరు చేశారు. కాగా, మరో లైంగిక దాడి కేసులో ముకేశ్‌కు కేరళ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2010లో త్రిసూర్ జిల్లా వడక్కడెరీలో తనను లైంగికంగా వేధించినట్టు మొదటి కేసులోని నటే ముకేశ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో రెండు కేసుల్లో ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు లభించింది.
సిద్దిఖీ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కృతి
మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో నటుడు సిద్ధిఖీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను రేప్ చేసినట్టు ఆ నటి చేసిన ఆరోపణలు నిజం కాదని, గత ఐదేండ్లుగా తనను ఆమె బెదిరిస్తున్నట్టు సిద్ధిఖీ న్యాయస్థానానికి తెలిపారు.
Also Read..
Damini App | పిడుగులపై ‘దామిని’ ముందస్తు హెచ్చరికలు.. ఈ యాప్ గురించి మీకు తెలుసా..?
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎప్పుడు..? ఎందుకంటే..?
Trash balloons | కిమ్ వదిలిన చెత్త బెలూన్ల కారణంగా.. సియోల్‌లో మూతపడుతున్న ఎయిర్‌పోర్ట్‌లు