Malvika Mohanan | దాదాపుగా పదేళ్ల క్రితం మలయాళంలో ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్ అయ్యింది మాళవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్‌తో ‘పేట’, విజయ్‌తో ‘మాస్టర్’. ధనుష్‌తో ‘మారన్’ సినిమాల్లో నటించింది. హిందీలో కూడా ఓ సినిమా చేసింది. కానీ.. తెలుగులో మాత్రం సినిమా చేయలేదు. తాజాగా ప్రభాస్ ‘రాజాసాబ్’తో తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు ఈవెంట్లో తన తాజా తెలుగు సినిమా గురించి మాట్లాడింది మాళవిక ‘నేను సౌత్‌లో అన్ని భాషల్లో చేశాను.. తెలుగులో తప్ప. మంచి పాత్ర దొరికితే తెలుగులో కూడా చేయాలనే కోరిక బలంగా ఉండేది.
టాలీవుడ్ ఆఫర్ కోసం ఆశగా ఎదురు చూశా. ఏకంగా పాన్‌వరల్డ్ స్టార్ ప్రభాస్‌తో చేసే ఛాన్సే వచ్చేసింది. ‘రాజా సాబ్’ ఆఫర్ నాదగ్గరకు వచ్చినప్పుడు నమ్మలేకపోయా. ఇప్పటికీ ఇది కలగానే అనిపిస్తోంది. ‘ఈ సినిమాతో నీ స్థాయి పెరిగింది’ అని పలువురు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ‘రాజా సాబ్’ ఓ భిన్నమైన సినిమా. ప్రభాస్ నుంచి ఇలాంటి కథను ఎవరూ ఊహించరు. లొకేషన్లో ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు మారుతిగారికి థ్యాంక్స్’ అని తెలిపింది మాళవిక మోహనన్.