SSMB29 | సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB 29’ పై సినీ ప్రపంచం అంతా ఓ కన్నేసి ఉంచింది. గ్లోబ్ ట్రాటర్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ దశలో ఉండగా, అసలు టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్, రాజమౌళి మధ్య సోషల్ మీడియాలో జరిగిన సరదా ట్వీట్స్ వార్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి నవంబర్‌లో ‘SSMB 29’ మెగా అప్డేట్ వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. నెల మారగానే అభిమానులు #noveMBerwillbehiSStoRic, #noveMBer వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలుపెట్టారు.
ఈ ట్రెండ్‌లో మహేష్ బాబూ కూడా జాయిన్ అవుతూ “ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది.. అప్డేట్ ఎక్కడ?” అంటూ జక్కన్నను ఎక్స్‌లో (ట్విట్టర్) నిలదీశారు. దానికి రాజమౌళి చమత్కారంగా “అవును మహేష్, నవంబర్ వచ్చింది. ఈ నెలలో ఏ సినిమాలకి రివ్యూలు ఇవ్వబోతున్నావు?” అంటూ మహేష్ రివ్యూ స్టైల్‌పై సెటైర్లు వేశారు. వెంటనే మహేష్ కూడా వెనక్కి తగ్గకుండా “మీరు ఎప్పటి నుంచో సిద్ధం చేస్తున్న మహాభారతం సినిమాకి రివ్యూ ఇస్తా” అంటూ రివర్స్ పంచ్ వేశారు. రాజమౌళి స్పందిస్తూ, “ఇప్పుడే మొదలైంది మహేష్.. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాం” అని ఫ్యాన్స్‌ని మరింత ఉత్కంఠలోకి నెట్టారు.
మహేష్ వెంటనే… “ఎంత నెమ్మదిగా ఇస్తారు సర్? 2030లో స్టార్ట్ చేద్దామా?” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “మన దేశీ పాప ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ వీధుల్లో ఇన్‌స్టా స్టోరీలు చేస్తోంది” అంటూ గ్లోబల్ బ్యూటీ పేరు లీక్ చేశారు. దానికి ప్రియాంక కూడా స్పందిస్తూ, “హలో హీరో.. నువ్వు సెట్లో చెప్పే కథలన్నీ నేనే లీక్ చేయాలా? మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా!” అంటూ మహేష్ స్టైల్లోనే రిప్లై ఇచ్చింది. రాజమౌళి వెంటనే “నువ్వు సర్ప్రైజ్ని నాశనం చేసావ్ మహేష్!” అంటూ ట్వీట్ చేశారు. అయితే మహేష్ అక్కడే ఆగకుండా “మీరు పృథ్వీరాజ్ సుకుమారన్‌ని కూడా సర్ప్రైజ్గా ఉంచాలనుకున్నారా?” అంటూ మరో లీక్ ఇచ్చేశారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా “సార్.. నేను హైదరాబాద్ వెకేషన్‌కి వస్తే నా ఫ్యామిలీ కూడా అనుమానిస్తోంది!” అంటూ ఫన్నీగా స్పందించారు. ఈ సరదా ట్వీట్ వార్ చివర్లో రాజమౌళి “మహేష్, ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావ్!” అని కోపంగా నటించారు. వెంటనే “జరిమానాగా నీ ఫస్ట్ లుక్ విడుదలను ఆలస్యం చేస్తున్నాను” అని ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఇది అంతా ఫన్‌గానే సాగింది.