‘నిర్మాతగా సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలన్నదే నా అభిమతం. నేను తీసే ప్రతి సినిమాలో కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి’ అన్నారు చింతా గోపాలకృష్ణారెడ్డి. అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్రతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు వెంకటేష్ మహా దర్శకుడు. అగ్ర హీరో మహేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. 1960-90దశకం మధ్య కథ ఇదని, ఈ సినిమా షూటింగ్ కోసం ఒరిస్సాలోని ఓ కోటను ఎంపిక చేసుకున్నామని, అక్కడ చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రమిదేనని తెలిపారు.
మహేశ్‌బాబు ఈ సినిమాను సమర్పించడం గౌరవంగా భావిస్తున్నామని, ఆయన వల్ల సినిమాపై పాజిటివ్ వైబ్ ఏర్పడిందన్నారు. ‘సినిమా చూసి మహేశ్‌బాబు సర్ప్రైజ్ అయ్యారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అని మెచ్చుకున్నారు. ఆయన మాటలు విజయంపై నమ్మకాన్ని పెంచాయి’ అని చింతా గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో రూపొందుతున్న రెండు చిత్రాల్ని వినాయకచవితి, దసరా సందర్భంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.