బ్లాక్‌బస్టర్ ‘తండేల్’ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న భారీ చిత్రానికి ‘వృషకర్మ’ అనే పేరును ఖరారు చేశారు. ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్నారు. ఆదివారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ టైటిల్‌నీ, ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చేత రాడ్‌ని పట్టుకొని ఉద్రేకంగా కనిపిస్తున్న నాగచైతన్యను ఈ పోస్టర్లో చూడొచ్చు.
ఆయన చుట్టూ ఆవరించి ఉన్న దుమ్ము, పొగ ఓ పవర్ఫుల్ యాక్షన్ వాతావరణాన్ని సూచిస్తున్నది. పోస్టర్లో కనిపిస్తున్న పురాతన భవనాలు, ప్రకాశవంతమైన బంగారు కాంతితో కూడిన ఆకాశం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చరిత్ర, పౌరాణిక అంశాల మేలుకలయికగా రూపొందుతున్న ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాగుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్.