మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. అధికారికంగా ప్రకటించకపోయినా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతున్నదనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
దానికి బలాన్నిస్తూ ఈ సినిమా కథానాయిక ప్రియాంక చోప్రా కొన్ని నేచర్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో మరోసారి ‘SSMB 29’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ ఫొటోలు చూసినవారంతా ఆ ప్రాంతాలను గుర్తు పడుతూ ‘మీరు కెన్యాలో ఉన్నారా?’ అనీ, ‘ఇది ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫొటోస్’ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీనికితోడు ఈ ఫొటోలపై మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా రియాక్టయ్యారు.
ఈ ఫొటోలకు లవ్ సింబల్ ఎమోజీలను జత చేసి కామెంట్ చేశారు. దాంతో మహేశ్‌బాబు అభిమానుల్లో ఈ ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్నది చాలా భారీ షెడ్యూల్ అనీ, సినిమాకు చెందిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తారని సమాచారం. ఇక ‘SSMB 29’కు సంబంధించిన తొలి అప్డేట్ నవంబర్‌లో ఉంటుందని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతులమీదుగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని తెలిసింది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.