Sitara | పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అందుకు నిదర్శనమే మహేశ్‌బాబు కుమార్తె సితార. పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అని కొన్నాళ్లక్రితం పసిపాపగా చూశాం. ఇప్పుడు టీనేజర్‌గా చూస్తున్నాం. ఓ విధంగా మన కళ్లముందే ఎదుగుతూవుంది సితార. అలాగే హీరోయిన్ కావడానికి తర్ఫీదు తీసుకుంటూ, డ్యాన్సుల్లో మెళకువలు నేర్చుకుంటూ సూపర్‌స్టార్ కృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లేపనిలో ఉంది ఈ బంగారుబొమ్మ. ఈ మధ్య ఓ వ్యాపారసంస్థకు సంబంధించిన ప్రకటనలో కూడా తళుక్కున మెరసి మహేశ్ కూతురా మజాకా అనిపించింది.
హీరోయిన్ అవ్వడం తన డ్రీమ్ అని మీడియా ముఖంగా ఇప్పటికే చెప్పేసిన సితార, సినిమా రంగంపై అపారమైన ప్రేమను పెంచేసుకుంది. ఈ రోజు ప్రపంచ సినిమా దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత సాంఘిక మాద్యమంలో సితార పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఫిలింవర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘సినిమా అనేది ఓ ఇండస్ట్రీ మాత్రమే కాదు. అది నా డీఎన్ఏ. మా తాత సూపర్‌స్టార్ కృష్ణ సినిమానే శ్వాసగా బతికారు . ఆయనే నాకు ఆదర్శం. ఆయన వారసురాలిని అయినందుకు గర్విస్తూ, తాతయ్య లెగసీని ముందుకు తీసుకెళ్లాలనుంది. మా నాన్న ఎలాగైతే వాళ్లనాన్న నుంచి స్పూర్తి పొందారో, నేనూ ఆలాగే మా నాన్న నుంచి స్ఫూర్తి పొందా’ అంటూ పోస్ట్ చేసింది సితార.