Mathu Vadalara 2 | టాలీవుడ్ యువ నటులు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2). బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘మత్తు వదలరా 2’ సినిమా చూశాను. ఇది ఒక ఫన్ ఎంటర్టైనర్. చాలారోజులకు ఒక సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ చూశాను. హీరో శ్రీ సింహతో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్ నువ్వు స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య… నువ్వు తెరపై కనిపించినప్పుడల్లా మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. అద్భుతంగా నటించారు. టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ మహేశ్ రాసుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బాబూమోహన్ (శ్రీసింహా), యేసు (సత్య).. ఇద్దరికీ డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడటంతో రోడ్డుమీద పడతారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి మొత్తానికి హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా ఉద్యోగాలు సంపాదిస్తారు. కిడ్నాపుల్ని ఛేదించడం, నిందితుల్ని పట్టుకోవడం వీళ్ల పని. ఆ పనిలో ఇద్దరూ పూర్తిగా ఆరితేరిపోతారు. జీతం డబ్బులతో బతకడం కష్టమై, అప్పుడప్పుడు చేతివాటం ప్రదర్శిస్తూ.. కొద్ది మొత్తంలో డబ్బుని కూడా తస్కరిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కొన్ని రోజులకు వాళ్లు చేస్తున్న పనిపై వాళ్లకే చిరాకేస్తుంది. ‘ఈ అరాకొరా ఆదాయంతో ఎన్నాళ్లు బతకడం.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి’ అని నిశ్చయించుకున్నారు. సరైన సమయంలో రెండుకోట్ల లావాదేవీలతో ముడిపడిన ఓ కిడ్నాప్ కేసు వీళ్ల దగ్గరకి వస్తుంది. ఆ కేసును అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఆ రెండు కోట్లు కొట్టేయాలనే ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. అయితే.. ఆ కిడ్నాప్‌కి గురైన యువతి అనూహ్యంగా వీళ్ల కారులోనే శవమై కనిపిస్తుంది. ఈ దారుణం చేసిందే వీళ్లే అని రుజువు చేసేలా ఓ వీడియో కూడా బయటపడుతుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? అసలు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు? ఈ కేసు నుంచి ఇద్దరూ ఎలా బయపడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.