దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్‌బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సినిమాపై అంచనాలను గ్లోబ్ అంతా అలుముకునేలా చేశాయి. 2027 సమ్మర్‌కు సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శకుడు రాజమౌళి ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ కార్యక్రమంలో వెల్లడించారు. దానికి తగ్గట్టే షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారాయన. ప్రసుతం మహేశ్‌బాబు చిన్ననాటి సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ చైల్డ్‌హుడ్ సీన్స్ సినిమాలో కీలకంగా ఉంటాయట. సాధారణంగా తన సినిమాల్లో నిమిషం నిడివి ఉండే సన్నివేశాలను కూడా జాగ్రత్తగా చెక్కుతారు కాబట్టే రాజమౌళీని అంతా జక్కన్న అంటారు. ప్రస్తుతం తీస్తున్న ఈ చిన్నప్పటి సీన్స్‌ను కూడా పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నారట రాజమౌళి. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇందులో హనుమంతుడి పాత్ర కీలకమని, ఆ పాత్రను మాధవన్ పోషించనున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. నిజానిజాలు తెలియాల్సివుంది. కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి.