షూటింగ్‌కు ముందే తన సినిమా కథల్ని రివీల్ చేస్తుంటారు అగ్ర దర్శకుడు రాజమౌళి. చాలా సినిమాల విషయంలో ఆయన ఇదే ఆనవాయితీని పాటించారు. అయితే ‘వారణాసి’ సినిమాకొచ్చేసరికి కథాంశం విషయంలో కాస్త గోప్యత పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో కథకు సంబంధించిన బేసిక్ లైన్‌ను మాత్రమే బయటపెట్టారు. టైమ్ ట్రావెల్ కథ ఇదని, రామాయణ ప్రస్తావన కూడా ఉంటుందని, ఓ ఎపిసోడ్లో హీరో మహేశ్‌బాబు రాముడి పాత్రలో కనిపిస్తాడనే వివరాల్ని వెల్లడించారు.
అయితే అభిమానులు మాత్రం ‘వారణాసి’ అసలు కథేంటి అనే అన్వేషణలో పడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో అనేక లీకులొస్తున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ‘వారణాసి’ కథ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాల్ని అందించింది. అద్భుతశక్తులు కలిగిన త్రేతాయుగం నాటి మహిమాన్విత విశ్వ కళాఖండాన్ని సాధించి, తద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలనే దురాలోచన చేస్తాడు క్రూరుడైన కుంభ (పృథ్వారాజ్ సుకుమారన్). దాని సాధనకై శివ భక్తుడైన రుద్ర (మహేశ్‌బాబు)ను ఎంచుకుంటాడు.
కుంభ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఆదేశాల మేరకు టైమ్ ట్రవెల్ చేసి ఆ శక్తిని సాధించేందుకు పూనుకుంటాడు రుద్ర. ఈ క్రమంలో అతను కొన్ని పురాతన రహస్యాలతో పాటు ఓ చీకటి నిజాన్ని తెలుసుకుంటాడు. కుంభ ఓ కుట్రదారుడని, ప్రపంచ ఆధిపత్యం కోసమే తనను ఈ కాలయాత్రకు పురమాయించాడని అర్థం చేసుకుంటాడు.
ఈ నేపథ్యంలో రామాయణ కాలంనాటి ఆ కళాఖండాన్ని పొందడానికి రుద్ర ఏం చేశాడు? కుంభ కుట్రల్ని ఎలా ఛేదించాడు? అన్నదే ఈ చిత్ర కథ అని సదరు విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ తన కథనంలో పేర్కొన్నది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ..సోషల్‌మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.