‘రంగమార్తాండ’ సినిమా తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న సమయంలో దర్శకుడు సంతోష్ ఈ కథ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. మా బ్యానర్ పేరు రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ కావడం, సినిమా టైటిల్ కూడా అమ్మవారి పేరు కావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాత మధు కలిపు. ఆయన నిర్మాణంలో సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది.
ఈ సందర్భంగా బుధవారం నిర్మాత మధు కలిపు పాత్రికేయులతో ముచ్చటించారు. వారాహి అమ్మవారి నేపథ్యంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిదని, బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ డివోషనల్ థ్రిల్లర్‌లో దాదాపు గంట పాటు ఉండే విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయి. గండికోట, ముచ్చింతల్, రామచంద్రపురం వంటి ఒరిజినల్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. అమ్మవారి గర్భగుడి కోసం భారీ సెట్ వేశాం. ప్రమోషన్లలో భాగంగా 150 థియేటర్లలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించాం. కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో దాదాపు 900 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు గొప్ప భక్తిభావంతో థియేటర్ నుంచి బయటికొస్తారు’ అన్నారు.