Jana Nayagan | తమిళ సూపర్ స్టార్, టీవీకే (TVK) పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ ‘A’ సర్టిఫికేట్ ఇవ్వాలని భావించింది. అయితే, సినిమా యూనిట్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాలోని అంశాలు సామాజిక స్పృహతో ఉన్నాయని పిల్లలు కూడా చూసేలా ‘U/A’ ఇవ్వాలని కోరింది.
ఈ కేసును నేడు విచారించిన న్యాయస్థానం సినిమాలోని సన్నివేశాలను పరిశీలించిన తర్వాత.. చిత్రంలో ఎక్కడా మితిమీరిన హింస కానీ అభ్యంతరకర అంశాలు కానీ లేవని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే ధోరణిని సినిమాలో చూపించారని పేర్కొంటూ తక్షణమే ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయాలని స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించబోతుంది.