నిన్నటితరం గ్లామర్ క్వీన్.. మాధురీ దీక్షిత్! వయసుతోపాటే ఆమె అందం కూడా పెరుగుతున్నది. 57 ఏళ్లలోనూ నవ నాయికలకు తీసిపోని గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నది. చాలారోజుల తర్వాత.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన ‘భూల్ భూలయ్యా 3’లో కనిపించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. ఇటీవల పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన పెళ్లి జరిగిన తీరు, వివాహ బంధం గురించి కొన్ని విషయాలు చర్చించింది. తన సోదరుడు అజిత్ దీక్షిత్ పట్టుబట్టడంతో అమెరికాలో కార్డియోవాస్కులర్ సర్జన్‌గా పనిచేస్తున్న శ్రీరామ్‌ని కలిసిందట మాధురి.
కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారడంతో.. 1999లో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారట. ఆ సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న మాధురి.. తన వివాహ వేడుకను అమెరికాలోనే జరుపుకొన్నట్లు చెప్పుకొచ్చింది. ‘వివాహబంధం ఎంతో గొప్పది. ఇది అనేక అనుభవాల కలబోత. పెళ్లి అనే ఒక్క మాటలో.. ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అందులో పాజిటివ్‌లు, నెగెటివ్‌లు ఉంటాయి. ఈ రెండిటినీ భార్యాభర్తలిద్దరూ సమానంగా చూడాలి’ అంటూ పెళ్లి గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది.