అగ్ర హీరో రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న రూరల్ రస్టిక్ మూవీ ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకుడు. మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా మేకర్స్ శుక్రవారం ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఎద్దును నడిపిస్తూ ధైర్యంగా వస్తున్న మాధవ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
బ్యాగ్రౌండ్లో శక్తివంతంగా కనిపించే కాళీమాత విగ్రహం, చుట్టూ గ్రామీణ పండుగ వాతావరణం, జనం సందడితో ఆసక్తికరంగా పోస్టర్ కనిపిస్తున్నది. దీపా బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, వి.ఎస్.రూపలక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, నిర్మాణం: మోక్ష ఆర్ట్స్.