Maatrubhumi Song | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ‘. దేశభక్తి నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా.. సల్మాన్ ఖాన్ సరసన బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ నటిస్తోంది. 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన యదార్థ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. ఇందులో సల్మాన్ ఖాన్ ఒక శక్తివంతమైన ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చిత్రబృందం రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ దేశభక్తి పాట అయిన ‘మాతృభూమి’ (Maatrubhumi)ని విడుదల చేసింది.
దేశభక్తిని చాటుతూ విడుదలైన ఈ గీతానికి హిమేష్ రేషమియా అద్భుతమైన సంగీతాన్ని అందించగా, స్టార్ సింగర్స్ అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ తమ గాత్రంతో ప్రాణం పోశారు. భారతీయ సైనికుల అసమాన ధైర్యసాహసాలు, త్యాగం మరియు దేశం పట్ల వారి అచంచలమైన ప్రేమని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.