టాలీవుడ్లో ఉన్న ప్రతిభావంతులైన గీత రచయితల్లో కేకే ఒకరు. స్వచ్ఛమైన తెలుగు పదాలతో ట్రెండ్‌కు తగ్గట్టు పాటలు రాయడం కేకే ప్రత్యేకత. ‘మిరాయి’లోని ‘వైబ్ ఉంది బేబీ..’, ‘తెలుసు కదా’లోని ‘మల్లిక గంథా..’ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలోని ‘మోనికా..’ పాటలే అందుకు నిదర్శనాలు. రీసెంట్గా విడుదలైన ‘ది రాజాసాబ్’లోనూ ‘సహనా సహనా..’ పాట రాశారాయన. గత ఏడాది తాను రాసిన పాటలన్నీ ప్రజాదరణ పొందడం పట్ల కేకే ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘ఇప్పటివరకూ 50పైగా సినిమాలకు పాటలు రాశాను.
గత ఏడాది నేను పాటలు రాసిన 22 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 45పాటలు శ్రోతల్ని అలరించాయి. ఈ ఏడాది అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నా. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలతో సహా పలు ప్రస్టేజియస్ ప్రాజెక్టులకు ప్రస్తుతం పాటలు రాస్తున్నాను. కెరీర్ మొదలైన కొత్తలో పెద్దహీరోలకు పాటలు రాయాలని కలలు కనేవాడ్ని. ఇప్పుడు వరుసపెట్టి పెద్దహీరోలకే పాటలు రాస్తున్నా. ప్రభాస్ సినిమాలకు పాటలు రాసే అవకాశం రావడానికి కారణం ఆయన దర్శకులంతా నా స్నేహితులు కావడమే. ఎన్టీఆర్ ‘వార్ 2’కు కూడా ఓ పాట రాశాను. సాహిత్యం విషయంలో మన హీరోలకు మంచి పట్టుంది.
ప్రభాస్, నాని లాంటివాైళ్లెతే చిన్నచిన్న సూచనలు కూడా చేస్తుంటారు.’ అని తెలిపారు కేకే. ఇంకా చెబుతూ ‘పాట రాయాలంటే ఏ హీరోకైనా ఒకేలా కష్టపడతా. ఓ విధంగా హీరోల కంటే సన్నివేశాలు, బాణీలే నన్నెక్కువగా ప్రభావితం చేస్తాయి. చిన్న సినిమాలైనా సన్నివేశానుగుణంగా ఏకాగ్రచిత్తంతో రాయడం నాకు అలవాటు. అందుకే ‘జనక అయితే గనక’ చిత్రంలోని ‘నా ఫేవరెట్ నా పెళ్లామే..’, ‘కమిటీ కర్రోళ్లు’ చిత్రంలోని ‘ఆ రోజులు మళ్లీ రావు..’, ‘ఓం భీమ్ బుష్’ లోని ‘అణువణువు..’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. త్వరలో రానున్న పాటలు కూడా మీ అందర్నీ తప్పక ఆకట్టుకుంటాయి.’ అని కేకే నమ్మకం వెలిబుచ్చారు.