ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే కథల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని కథలు ముందు వరుసలో ఉంటాయి. ‘ఆదిత్య 369’ నుంచి సౌత్ సినిమాలో ఈ తరహా కథలు అడపా దడపా పలకరిస్తూనే ఉన్నాయి. త్వరలో ‘LIK’ పేరుతో ఓ టైమ్ ట్రావెల్ మూవీ రానుంది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనేది ట్యాగ్‌లైన్. ఒక మొబైల్ గాడ్జెట్‌ని ఉపయోగించి టైమ్ ట్రావెల్ అయ్యి, తన ప్రియురాలిని చేరుకున్న ప్రియుడు కథతో ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో ప్రియురాలుగా ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటిస్తుంటే, ప్రియుడి పాత్రను ‘లవ్ టుడే’ ఫేం ప్రదీప్ రంగనాథన్ పోషిస్తున్నారు.
అగ్రనటి నయనతార ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. ఆమె భర్త విగ్నేష్ శివన్ దర్శకుడు. అనిరుధ్ సంగీత దర్శకుడు. రీసెంట్గా కోలీవుడ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. పింక్ కలర్ సోఫాలో పడుకొని, సిల్వర్ కలర్ స్కర్ట్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తున్న కృతిశెట్టి స్టిల్ ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేకపోయినా.. కోలీవుడ్‌లో మాత్రం మంచి అవకాశాలనే దక్కించుకుంటున్నది కృతి శెట్టి.