యువ నటుడు దేవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్ నాచురల్ లవ్‌స్టోరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఉపశీర్షిక. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. జ్యోత్స్న.జి నిర్మాత. త్వరలో సినిమా విడుదలకానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత డి.సురేశ్‌బాబు, మాజీ సిబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘సినిమాను హానెస్ట్‌గా తీస్తే అంతా సపోర్ట్ చేస్తారని ‘కృష్ణలీల’ సినిమా నిరూపించింది.
ఇది బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. ప్రేమంటే ఒక త్యాగం, ప్రేమంటే ఒక యుద్ధం. ఎంతటి త్యాగానికైనా వెనుకాడనిదే నిజమైన ప్రేమ. ఈ అంశాన్నే ‘కృష్ణ లీల’ చిత్రంలో థ్రిల్లింగ్‌గా చూపించాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.’ అని హీరో, దర్శకుడు దేవన్ చెప్పారు. నిజాయితీగా తీసిన సినిమా ఇదని కథానాయిక ధన్య బాలకృష్ణ అన్నారు. ఈ సినిమాను దేవన్ అద్భుతంగా మలిచాడని నిర్మాత జోత్స్న తెలిపారు. ఇంకా రైటర్ అనిల్ కిరణ్ కూడా మాట్లాడారు.