Lokesh Kanagaraj | తమిళం నుంచి మరో స్టార్ దర్శకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకుడి నుంచి హీరోగా మారి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుండగా తాజాగా మరో అగ్ర దర్శకుడు హీరోగా రాబోతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు కథానాయకుడిగా సరికొత్త అవతారమెత్తబోతున్నారు. కార్తీతో ‘ఖైదీ’, విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ దర్శకుడు తాజాగా ‘కెప్టెన్ మిల్లర్ 2’ చిత్రంలో హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.
‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం గతంలో ధనుష్ హీరోగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్లో లోకేష్ కనకరాజ్ హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం లోకేష్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, ఫైట్స్ మరియు ఆత్మరక్షణ విద్యల్లో నైపుణ్యం సాధించారని సమాచారం. అంతేకాదు, తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని, ఈ పాత్రకు పర్ఫెక్ట్ లుక్‌ను సిద్ధం చేసుకున్నారట. ఇదిలా ఉంటే గతంలో రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటించే చిత్రానికి లోకేష్ దర్శకత్వం వహిస్తారని అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో ఓ చిత్రం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లను లోకేష్ ప్రస్తుతం పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. అలాగే ఖైదీ 2 కూడా వాయిదా పడినట్లు సమాచారం.