వెండితెర అమ్మ దయామయి. కరుణాంతరంగిణి. అదే సిల్వర్ స్క్రీన్‌పై నాన్న నవరసాలు ఒలికించాడు. అమ్మ విషయంలో ఆచితూచి స్క్రిప్టులు రాసుకున్న సినీజనాలు. అవకాశం కుదిరినప్పుడల్లా నాన్న పాత్రతో ఆటాడుకున్నారు. నాన్నను హీరోను చేశారు, విలన్‌గా చూపించారు. నాన్నతో హాస్యం పండించారు, కరుణ రసం ఒలికించారు. మొత్తంగా నాన్న క్యారెక్టర్ని గట్టిగానే వాడుకున్నారు. కాలం మారే కొద్దీ నాన్న పరిధిని మరింత పెంచేశారు. ఫాదర్స్ డే సందర్భంగా వెండితెర తండ్రులను గుర్తుచేసుకుందాం..
వెండితెరపై కరుణ రసం పండించే తండ్రి పాత్ర అనగానే గుర్తొచ్చే పేరు నాగయ్య. తెలుగు సినిమా తొలిరోజుల్లో హీరోగా అలరించిన ఆయన.. తర్వాత తండ్రి పాత్రకు కేరాఫ్‌గా నిలిచారు. సినిమా ఏదైనా.. తండ్రి పాత్రలో ఆయనే తళుక్కుమనేవారు. నాగయ్య ఇండస్ట్రీలో ఉండగానే తండ్రి పాత్రకు కేరాఫ్‌గా నిలిచిన నటుడు గుమ్మడి. ఆయన నటించిన సినిమాల్లో సింహభాగం తండ్రిగానే కనిపించాడు. అడపాదడపా విలనిజం పండించినా.. తండ్రి క్యారెక్టర్‌కు డెఫినిషన్ ఇచ్చింది మాత్రం ఆయనే అనుకోవచ్చు. పిల్లలను బుజ్జగించే తండ్రిగా ఎంత గొప్పగా నటించేవాడో, ‘అంతస్తులు’ సినిమాలో స్ట్రిక్ట్ ఫాదర్‌గా అంతగా జీవించాడాయన. గుమ్మడి తర్వాత ఆ తరహా ఫాదర్హుడ్ను టాలీవుడ్లో పండించిన నటుడు ప్రభాకర రెడ్డి. బీద తండ్రిగా ఆయన చూపించిన అభినయం 70, 80లలో ట్రెండ్ సెట్టర్ అయింది. కథలో తండ్రి పాత్ర మంచితనానికి మారుపేరుగా ఉంటే చాలు.. దర్శకులు ప్రభాకర రెడ్డిని సంప్రదించేవారు. గుమ్మడి తర్వాత తండ్రి పాత్రకు న్యాయం చేసిన నటుడిగా పేరు పొందాడు.
వెండితెర దిగ్గజం ఎస్వీ రంగారావు తండ్రి పాత్రలు ఎన్నో చేశాడు. అయితే, కేవలం సెంటిమెంట్‌కే పరిమితం కాలేదు ఆయన. ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’, ‘దేవదాసు’ సినిమాల్లో ఓ మోస్తరు తండ్రిగా కనిపించే ఆయన ‘దక్షయజ్ఞం’లో నట విశ్వరూపం చూపించాడు. ఇక ఆయన విలనిజం పండిస్తూనే, తండ్రిగా పతాక స్థాయిలో కరుణ కురిపించిన సినిమా ‘భక్త ప్రహ్లాద’. శ్రీహరిని కీర్తిస్తున్న తన కొడుకును దండించే క్రమంలో ఆయన చూపిన క్రౌర్యం, కన్నకొడుకును దూరం చేసుకుంటున్నానే అని తండ్రిగా పడే ఆవేదన రెండు భావాలనూ రెండు కండ్లతో పలికించాడు. ‘శాంతినివాసం’లో దారితప్పిన బిడ్డలను చక్కదిద్దిన తండ్రి పాత్రలో ఎస్వీ రంగారావు చూపించిన నటన అనితర సాధ్యం
అనిపిస్తుంది.
నాన్నతో విలనీ క్యారెక్టర్ అనగానే కండ్లముందు కదలాడే నటుడు నాగభూషణమే! డైరెక్ట్ విలన్ క్యారెక్టర్ల కన్నా.. దుష్ట తండ్రి పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడాయన! తన పిల్లల విషయంలో బాధ్యతగా మెలిగే ఆ పాత్ర.. డెన్లోకి వెళ్లగానే ఒక్కసారిగా మారిపోతూ కనిపిస్తుంటుంది. ఇలాంటి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎన్నెన్నో వచ్చాయి. వాటిలో సింహభాగం నాగభూషణమే అలరించాడు. వెండితెరపై నవరస నట సార్వభౌముడిగా కీర్తి గడించిన కైకాల సత్యనారాయణ గుడ్ ఫాదర్‌గా, బ్యాడ్ ఫాదర్‌గా ఎన్నో సినిమాలు చేశాడు. కరుణ రసం పండించడంలో కైకాల తర్వాతే ఎవరైనా అన్న పేరు తెచ్చుకున్నాడు.
రిచ్ ఫాదర్‌గా, కామెడీ ఫాదర్‌గా, నిరుపేద తండ్రిగా, మధ్యతరగతి నాన్నగా ఆయన వేయని తండ్రి పాత్ర లేదు. అన్ని పాత్రలకూ వంద శాతం న్యాయం చేశాడు. విలనిజానికి నిజమైన భాష్యం చెబుతూ, తండ్రి పాత్రను రక్తికట్టించిన నటుడు రావు గోపాలరావు. మంచి నాన్నగానూ రావు గోపాలరావుకు గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. ఆ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రావు రమేశ్ ఇప్పుడు గుడ్ ఫాదర్‌గా ఈ తరానికి దగ్గరయ్యాడు. ఆయన చేస్తున్న ప్రతి నాలుగు సినిమాల్లో మూడైనా తండ్రి పాత్రలే ఉంటుండటం విశేషం.
తండ్రి పాత్రకు పెట్టని కోట లాంటి నటుడు కోట శ్రీనివాసరావు. ఏ తరహా పాత్రనైనా అలవోకగా పండించే ఆయన.. తండ్రి పాత్రకు కొత్త నిర్వచనం చెప్పాడు. కొన్ని సినిమాల్లో విలన్‌గా కనిపిస్తూనే.. తండ్రి పాత్రకు తగిన న్యాయం చేశాడు. ఇలాంటి తండ్రి ఎవరికీ ఉండొద్దు అన్న క్యారెక్టర్లు చేశాడు, తండ్రంటే ఇలా ఉండాలన్న పాత్రలూ పోషించాడు. ఏది చేసినా.. ప్రేక్షకులు గొప్పగా ఆదరించేలా అదరగొట్టడం కోట ైస్టెల్. ‘ఆహా నా పెళ్లంట’ సినిమాలో పీనాసి తండ్రిగా వంద మార్కులు గెలుచుకున్నాడు.
‘మామగారు’ సినిమాలో చిల్లర నాన్నగా అలరించాడు. ‘ఆమె’ చిత్రంలో భయపెట్టాడు. ‘మా నాన్నకు పెళ్లి’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాల్లో లవ్లీ ఫాదర్‌గా దగ్గరయ్యాడు. ‘ఇడియట్’ చిత్రంలో గుడ్ ఫాదర్‌గా మార్కులు కొట్టేశాడు. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అయితే నాన్నతనానికి నిర్వచనమే చెప్పేశాడు. మొత్తంగా కోట శ్రీనివాసరావు తండ్రి పాత్రలకు చెరగని చిరునామాగా నిలిచాడు. తండ్రి పాత్రలో ఒక్కో నటుడూ ఒక్కో రసం పండిస్తే.. ఆ పాత్రలోనే నవరసాలు పలికించిన నటుడు అనిపించుకున్నాడు కోట.
కథను మలుపుతిప్పే తండ్రి పాత్రల్లో ఎవరైతే బాగా చేస్తారని ఇండస్ట్రీ ఆలోచిస్తున్న తరుణంలో ప్రకాశ్‌రాజ్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. కోట తర్వాత వైవిధ్యమైన నాన్న పాత్రలతో క్రేజీ సంపాదించాడు. ‘నువ్వే.. నువ్వే..’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘అశోక్’, ‘ఆకాశమంతా’ తదితర సినిమాలతో తండ్రి పాత్రకు దిశానిర్దేశం చేశాడు ప్రకాశ్‌రాజ్. ‘బొమ్మరిల్లు’ సినిమా మరింత ప్రత్యేకం. బిడ్డల బాగు కోసం తపన పడే తండ్రిగా ఆయన నటన అదుర్స్ అనిపిస్తుంది. ఆ చిత్రం చివర్లో తన అభిమానం, క్రమశిక్షణ కారణంగా పిల్లలు ఏం మిస్ అవుతున్నారో తెలిసి.. మదనపడే సన్నివేశంలో ప్రకాశ్‌రాజ్ సిసలైన తండ్రి అనిపించుకున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక కాస్త స్ట్రిక్ట్‌గా ఉన్న తండ్రులందరూ ‘బొమ్మరిల్లు ఫాదర్’ అన్న కితాబు దక్కించుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చాలామంది నటులకు తండ్రి పాత్ర ఊతకర్రలా మారింది. ఒకప్పుడు హీరోలుగా అలరించిన చాలామంది రీ ఎంట్రీలో తండ్రులుగా ఎదుగుతున్నారు. వారిలో పక్క ఇండస్ట్రీ హీరోలూ ఉండటం విశేషం. సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, అర్జున్, సుమన్, సాయికుమార్, సత్యరాజ్ తదితరులు యంగ్ హీరోహీరోయిన్లకు తండ్రులుగా సక్సెస్ సాధిస్తున్నారు. నరేశ్ కామెడీ టైమింగ్‌తో అలరిస్తుంటే.. రాజేంద్రప్రసాద్ తన అనుభవంతో పాత్రను పండిస్తున్నాడు. జగపతిబాబు మంచి తండ్రిగా, బ్యాడ్ విలన్‌గా రెండు పార్శాలూ చూపిస్తున్నాడు. మొత్తంగా వెండితెరపై నాన్న పాత్ర సినిమాకు దన్నుగా నిలబడిందనే చెప్పాలి! హ్యాపీ ఫాదర్స్ డే!!
తండ్రి పాత్రకు వన్నెలు దిద్దిన నటులు కొందరు. అందులో ఒకరు సీఎస్సార్ ఆంజనేయులు. పాతాళభైరవిలో రాకుమారి తండ్రిగా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ‘అప్పు చేసి పప్పుకూడు’లో కన్నింగ్ ఫాదర్‌గా మెస్మరైజ్ చేశాడు సీఎస్సార్. డిఫరెంట్ ఫాదర్ కేటగిరిలో వచ్చే మరో నటుడు రేలంగి. అద్భుతమైన టైమింగ్‌తో కామెడీ పండించే రేలంగి వందల సినిమాల్లో తండ్రిగా కనిపించాడు. ‘ప్రేమించి చూడు’, ‘ఆత్మీయులు’, ‘రాము’ చిత్రాలు రేలంగిని డిఫరెంట్ నాన్నగా చూపించాయి. ధూళిపాళ, ముక్కామల, మిక్కిలినేని కూడా గుర్తుండిపోయే తండ్రి పాత్రలు పోషించారు. డిఫరెంట్ ఫాదర్ కేటగిరిలో కనిపించే నటులు నూతన్ ప్రసాద్, గొల్లపూడి, తనికెళ్ల భరణి. అవకాశం వచ్చిన ప్రతిసారీ తండ్రి గ్రాఫ్‌ను అమాంతం పెంచేసినవారే వీరంతా!
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువగా తండ్రి పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ హయాం నుంచి ప్రభాస్ జమానా వరకు తండ్రి స్టార్డమ్లో ఉన్నప్పుడు తండ్రి పాత్ర పోషించిన స్టార్ హీరోలు తక్కువనే చెప్పాలి. పాత రోజుల్లో అయినా కథ డిమాండ్ చేస్తే ఎన్టీఆర్, ఏయన్నార్ కొన్నిసార్లు తండ్రి పాత్రలు పోషించారు కానీ, ఆ తర్వాత జనరేషన్లో శోభన్‌బాబు యంగ్ ఫాదర్‌గా అలరించాడు. చిరంజీవి శకానికి వస్తే.. పెద్ద హీరోలు అతికొద్ది చిత్రాల్లో తండ్రిగా కనిపించారు. స్నేహం కోసం, డాడీ సినిమాల్లో ఫక్తు ఫాదర్ క్యారెక్టర్ వేశాడు చిరు. ఈ విషయంలో వెంకటేశ్ కాస్త ఎక్కువ చొరవ చూపించాడనే చెప్పాలి. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘నారప్ప’ సినిమాల్లో నాన్న పాత్రను ఆకాశమంత పెంచాడు. ఆ తర్వాతి జనరేషన్లో కాస్త డిఫరెంట్ స్టోరీ లైన్ ఉంటే తప్ప తండ్రిగా నటించడానికి యంగ్ హీరోలు అంగీకరించడం లేదు. ఈ విషయంలో నాని కాస్త ముందున్నాడు. ‘జెర్సీ’, ‘హాయ్ నాన్న’ సినిమాలో భారమైన తండ్రిగా భావోద్వేగాలను పండించాడు ఈ నేచురల్ స్టార్.