అరుణ్, సృజన జంటగా నటిస్తున్న సినిమా ‘వేటాడతా’. ఈ చిత్రాన్ని అంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిత మూవీస్ సమర్పణలో ఎం.అంకయ్య నిర్మిస్తున్నారు. సురేష్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అంకయ్య మాట్లాడుతూ…‘మా సంస్థలో ఇప్పటికే ‘మాయా మహాల్’ అనే చిత్రాన్ని విడుదల చేశాం. మరో రెండు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మా అబ్బాయి అరుణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో సినిమా ఉంటుంది’ అన్నారు. దర్శకుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ…‘సస్పెన్స్, మర్డర్ మిస్టరీ చిత్రమిది. ఈ నెలాఖరుకు రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్, అరకు, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వరప్రసాద్ రెడ్డి, సంగీతం : శేఖర్ మోపూరి.