Nayanthara | లేడీ సూపర్‌స్టార్ నయనతార హ్యాకింగ్ బారిన పడింది. ఆమె ఎక్స్(ట్విటర్) ఖాతా హ్యాక్ అయినట్టు తాజాగా ఆమె తెలియజేసింది. ‘దయచేసి ఆ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్వీట్లకు కానీ ఎవరూ స్పందించొద్దు. నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయంపై సైబర్ పోలీస్‌లకు కంప్లయింట్ చేశా. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తా’ అని నయన్ తన ఎక్స్ ద్వారా వెల్లడించింది. నయనతార మొదట్నుంచీ సోషల్‌మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది.
తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా అభిమానులతో పంచుకునేందుకు ఆమె ఎక్స్‌ని, ఇన్‌స్టాని ఉపయోగిస్తుంది. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో కూడా కచ్చితంగా కొన్ని పద్ధతులు పాటిస్తుంది. తన సొంత ప్రొడక్షన్ సినిమా అయితే.. వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తుంది. బయట సినిమాలను ఆమె ప్రమోట్ చేయదు. అలాంటి నయనతార ఖాతా హ్యాక్ అవ్వడంతో ఆమె ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం టెస్ట్, తని ఒరువన్-2, మన్నన్‌గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ సినిమాలతో నయనతార బిజీగా ఉంది.