Megastar Chiranjeevi | గత రెండు వారాలుగా కార్మికుల సమ్మె కారణంగా సినిమా షూటింగులు బంద్ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో చిన్న నిర్మాతలు ఆదివారం భేటీ అయ్యారు. వారి సమస్యలన్నింటినీ విన్న చిరంజీవి.. సోమవారం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. 24 క్రాఫ్ట్స్ నుంచి 72మంది సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ ‘15రోజులుగా వేతనాలు పెంచాలంటూ మేం సమ్మె చేస్తున్నాం. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవిగారు మమ్మల్ని పిలిచి ఈ విషయంపై మాట్లాడారు. మా సాధక బాధలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకున్నారు.
కొందరు నిర్మాతలు మా బాధలు వినకపోగా మాపైనే నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు మా ముందుంచుతూ మమ్మల్ని మానసిక వేదనకు గురిచేస్తున్నారు. మాతోపాటు నిర్మాతలు కూడా బావుండాలనే మేమంతా కోరుకుంటాం. వాళ్లు పెట్టిన వర్కింగ్ కండీషన్స్‌లో రెండు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటి గురించి చిరంజీవిగారికి విన్నవించుకున్నాం. రెండో ఆదివారంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో పనికి మాత్రమే డబుల్ కాల్షీట్ ఇస్తామనడం, మిగతా ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్ వర్తిస్తుందనడం దారుణం. ఈ విషయాన్నే చిరంజీవిగారి దృష్టికి తీసుకెళ్లాం. మాపై కొందరు నిర్మాతలు ఆకారణంగా నిందలు వేస్తున్నారు. వాటన్నింటినీ చిరంజీవిగారికి వివరించాం.
మా బాధలన్నింటినీ విన్న చిరంజీవి సానుకూలంగా స్పందించారు. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్మొహమాటంగా తన దగ్గరకు రావొచ్చని ఆయన భరోసా ఇచ్చారు. రేపు జనరల్ బాడీ మీటింగ్‌ను ఏర్పాటు చేశాం. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా మాకు పిలుపు వచ్చింది. రేపు ఫిల్మ్‌ఛాంబర్‌తో సమావేశం కానున్నాం. చర్చలకు ఛాంబర్ నుంచి పిలుపు వచ్చింది కనుక ప్రస్తుతానికి నిరసన కార్యక్రమం ఆపివేస్తున్నాం. మా వేతనాల విషయంలో సానుకూల ప్రకటన ఛాంబర్ నుంచి రేపు వస్తుందని ఆశిస్తున్నాం.’ అని వల్లభనేని అనిల్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. మరోవైపు ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో నిర్మాతలు అత్యవసర సమావేశం అయ్యారు. వర్కింగ్ కండీషన్లు, వేతనాల పెంపు విషయాలపై చర్చలు జరిగాయని సమాచారం. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో మంగళవారం మరోసారి చిరంజీవి భేటీ కానున్నారని తెలిసింది. అలాగే.. ఫిల్మ్‌ఛాంబర్, కార్మిక సంఘాలు కూడా నేడు భేటీ కానున్నాయి. మంగళవారం జరిగే ఈ కీలక సమావేశాలతో.. సమ్మె సమస్య ఓ కొలిక్కి వస్తుందని ఇరు వర్గాలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.