Laapataa Ladies | 2025 ఆస్కార్‌కు మనదేశం నుంచి ‘లాపతా లేడీస్’ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో భారత్ నుంచి ఎంట్రీ దక్కించుకుంది. బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు ఈ బాలీవుడ్ చిత్రానికి డైరెక్టర్. ఆమిర్‌ఖాన్ నిర్మాత. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ ఇందులో ప్రధాన భూమికలు పోషించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ పరంగా కూడా విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా ఆస్కార్‌కి ఎంపిక అవుతుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కిరణ్‌రావు జోస్యం చెప్పారు. ‘2015 ఆస్కార్ అవార్డుల్లో మన దేశం తరఫున అధికారిక ప్రవేశానికి ‘లాపతా లేడీస్’ అర్హత సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ సినిమా ఆస్కార్ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహిచాలని మా టీమ్ ఆకాంక్ష’ అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు కిరణ్‌రావు.
ఆమె అన్నట్టే ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపికైంది. ఇక ‘లాపతా లేడీస్’ కథ విషయానికొస్తే.. 2001లో సాగే కథ ఇది. పల్లెప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లికూతుళ్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే ఈ చిత్ర కథ. భారతీయ సమాజంలో కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరిస్తున్న తీరుని, వారి ఆకాంక్షలను అణచివేస్తున్న ధోరణిని సందేశాత్మకంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు సీరియస్ అంశాలను చర్చకు తీసుకొచ్చిందీ చిత్రం. పెళ్లి చేసుకొని అత్తారింట్లో సేవలు చేయడానికి మాత్రమే మహిళలు ఉన్నారని, వారికి ఎలాంటి వ్యక్తిగత ఇష్టాలు ఉండవనే ఆలోచనల్లో మార్పు రావాలని దర్శకురాలు కిరణ్‌రావ్ ఈ సినిమా ద్వారా తెలియజెప్పారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఈ సినిమాను రూపొందించారు. గతేడాది ప్రతిష్టాత్మ టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే సుప్రీంకోర్ట్ 75ఏళ్ల వేడుకలో కూడా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ అవార్డుల్లోనూ క్రిటిక్స్ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.