“ఖుషి’ చిత్రానికి అంతటా అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రతీ షోకు వసూళ్లు పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో మరికొద్ది రోజుల్లో చెబుతాం’ అన్నారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం మనదేశంలో వందల ఏళ్ల నుంచి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథను చెప్పాలనుకున్నా. థియేటర్లు ఫ్యామిలీస్‌తో కళకళలాడుతున్నాయి. ఓ క్లిష్టమైన పాయింట్‌ను అందరికి అర్థమయ్యే విధంగా సరళంగా చెప్పారని ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. సిద్ధాంతలు వేరైనా ప్రేమించిన మనుషులతో కలిసి ఉండాలని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం.’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్, సినిమాటోగ్రాఫర్ జి.మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి తదితరులు పాల్గొన్నారు.