Guntur Kaaram | మహేశ్ బాబు ఏంటి.. ఆయన రేంజ్ ఏంటి.. అలాంటి హీరో ఇలాంటి పాట చేయడం ఏంటి..? సరే మహేశ్ బాబును వదిలేయండి.. అసలు త్రివిక్రమ్‌కు ఏమైంది.. ఆయన ఎలాంటి సినిమాలు చేశారు.. ఎంత అద్భుతమైన మాటలు రాస్తాడు.. అలాంటి దర్శకుడి సినిమాలో ఇలాంటి పాటా.. సిరివెన్నెల చనిపోయిన తర్వాత త్రివిక్రమ్ సాహిత్యం కూడా పూర్తిగా దెబ్బ తిందా..? లేదంటే వ్యూస్ కోసం ఆయన కూడా పక్కదారి పడుతున్నాడా అంటూ కుర్చీ మడతబెట్టి పాట విడుదలైన రోజు నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏ పాటకు రానంత రెస్పాన్స్ కూడా దీనికి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
థమన్ నిజంగా దీనికి అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చాడు అనడంలో నో డౌట్.. అందుకే ఆడియన్స్‌కు కూడా అదిరిపోయేలా రీచ్ అయింది కుర్చీ మడతపెట్టి సాంగ్. ముఖ్యంగా కాపీ ట్యూన్ అంటున్నారు కానీ ఈ పాటలో ఇచ్చిన బీట్ వింటుంటే మాత్రం రిపీట్ మోడ్‌లో ప్లే చేయడం ఖాయం. ఒక్కసారి విని ఊరుకునే పాటైతే కాదు ఇది.. రేపు థియేటర్స్‌లో గుంటూరు కారం రేంజ్ పెంచే పాట కూడా ఇదే అవుతుందని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. నాగవంశీ అయితే ఫ్యాన్స్‌కు ఈ పాట విషయంలో చాలానే చెప్పుకొచ్చాడు. ఈయన మాట్లాడిన ఓ ఫోన్ కాల్ లీక్ అయింది.
అందులో మాట్లాడుతూ.. కుర్చీ మడతబెట్టి పాటలో మహేశ్ బాబు చేసిన డాన్సులకు థియేటర్స్ ఊగిపోతాయంటున్నాడు. సెకండాఫ్ మొత్తానికి ఆ పాట హైలైట్ అవుతుందని.. అందులో చాలా మాస్ స్టెప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు వంశీ. మరోవైపు త్రివిక్రమ్‌ను తిడుతున్నా కూడా మరోవైపు ఈ పాటను చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. గుంటూరు కారంలో ముందు విడుదలైన ధమ్ మసాలా, తర్వాత వచ్చిన ఓ మై బేబీ పాటలకు వచ్చిన వ్యూస్ కంటే నాలుగు రోజుల్లోనే కుర్చీ మడతబెట్టి పాటకు డబుల్ వ్యూస్ వచ్చాయంటే దీని రీచ్ అర్థమవుతుంది.
రాబోయే రోజుల్లోనూ ఈ పాట హవా ఇలాగే కంటిన్యూ అవ్వడం అయితే ఖాయం. ఇక లిరిక్స్ అంటారా.. ఈ మధ్య కాలంలో ఏ సినిమా పాటలోనూ అర్థవంతమైన సాహిత్యం ఉండటం లేదు. అలాంటప్పుడు కేవలం త్రివిక్రమ్‌ను మాత్రమే నిందిస్తే సరిపోదు. అది అందరూ కలిసి తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఎవరేం అనుకున్నా కూడా గుంటూరు కారం సినిమాకు అడిషినల్ అట్రాక్షన్ ఇచ్చిన పాట మాత్రం కుర్చీ మడతబెట్టే..! అందుకే మహేశ్ బాబు కూడా డ్యాన్సుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడా తగ్గలేదు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఇలాంటి మాస్ స్టెప్పులు అయితే చూడలేదు. అభిమానుల కోసం రెచ్చిపోయి చేశాడు సూపర్ స్టార్.