దర్శకుడిగా 25ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శేఖర్ కమ్ముల. సుదీర్ఘ కెరీర్లో తీసినవి పది సినిమాలే అయినా అవన్నీ వేటికవే ప్రత్యేకం. మానవ సంబంధాల పట్ల ప్రేమ, సామాజిక పరివర్తన కోసం తపన, మనదైన సంస్కృతిపై మమకారం ప్రధానాంశాలుగా ఆయన సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా ఆయన ఆర్థిక అంతరాల్ని చర్చించే ‘కుబేర’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల బుధవారం పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
ఈ సినిమా కథకు ప్రేరణ అంటూ ఏమీ లేదు. సమాజంలో ఆర్థిక అంతరాల నేపథ్యంతో రాసుకున్నా. సంపన్నుడు వర్సెస్ బిచ్చగాడు..వీరి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందన్నదే కథలో ప్రధానాంశం. నిజంగా ఇలాంటి కథ చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్ ఇది. కానీ కథపై వర్క్ చేస్తున్న కొద్దీ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తయారయింది.
ప్రపంచంలో అన్నీ తనకే కావాలనుకునే ఒక మిలియనీర్, తనకు ఏమీ వద్దనుకునే బిచ్చగాడి మధ్య కథ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథ రాలేదు. ప్రజల్లో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుందనే నమ్మకంతో ఈ సినిమా చేశా. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూట్ చేశాం. సాంకేతికంగా రెండు సినిమాలు తీసినట్లే అనుకోవచ్చు. అందుకే ఎక్కువ సమయం తీసుకుంది.
కొన్ని పాత్రలు నాగార్జునగారే చేయాలనిపిస్తుంది. ఇది అలాంటిదే. బిలియనీర్ పాత్ర ఆయనకు పర్ఫెక్ట్గా కుదిరింది. నాగార్జునగారిని తెరపై చూస్తే ఏదో మ్యాజికల్ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటికీ మన్మథుడిలా ఉంటారు. అందుకే ఆయన్ని డిఫరెంట్ మేనరిజమ్స్, ైస్టెల్లో చూపించడం జరిగింది.
ఇక సినిమాలో దేవా పాత్రను ధనుష్ తప్ప మరెవరూ చేయలేరు. సినిమా చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనడం చాలా చిన్న మాట అవుతుంది. అంతలా తన క్యారెక్టర్లో లీనమైపోయారు. ఎంత కష్టమైన సీన్ అయినా సింగిల్ టేక్‌లో చేస్తారాయన. రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది.
ప్రేక్షకులు ‘ఇది శేఖర్ కమ్ముల మార్క్ సినిమా’ అంటుంటారు. అయితే ఏదో ప్రత్యేకమైన ముద్ర కోసం నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. ‘హ్యాపీడేస్’ కాలేజీ స్టోరీ కాబట్టి ఫన్, ఎమోషన్స్‌తో సాగుతుంది. ‘కుబేర’ కథ కూడా అంతే. మార్క్ అనేది కథ ప్రకారమే ఉంటుంది. నేను ఏ సినిమానైనా నిజాయితీగా తీస్తాను. అది ‘కుబేర’లో పదింతలు కనిపిస్తుంది.
ముంబయిలో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. అదో మినీ భారతదేశం. ఇలాంటి ఆర్థిక అంతరాల కథకు ముంబయి పర్ఫెర్ట్ నేపథ్యం అనిపించింది. ఎక్కువభాగం అక్కడే షూటింగ్ చేశాం. కథాపరంగా ముంబయిలో తీయడం తప్పనిసరై పోయింది. ముంబయిలో షూటింగ్ కూడా కష్టంగానే అనిపించింది. ఎందుకంటే అక్కడ పర్మిషన్స్ సులభంగా లభించవు. ప్రతీ చోటా రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది.
వ్యక్తిగత జీవితంలో నేను చాలా సింపుల్‌గా ఉంటాను. ఎవరి దగ్గరా ఏదీ ఆశించలేదు. సినిమాల విషయంలో కూడా లాభాల్లో వాటా కావాలని ఏరోజూ డిమాండ్ చేయలేదు. నా పారితోషికం మాత్రమే తీసుకుంటా. దాని వల్ల చాలా నష్టపోయిన సందర్భాలున్నాయి. అయినా ఏ విషయంలోనూ బాధపడలేదు. ప్రేక్షకులు ఎంతో ప్రేమని ఇచ్చారు. నాపై ఓ నమ్మకాన్ని ఉంచారు. దానిని నిలబెట్టుకున్నా. అది అన్నింటికంటే ఎక్కువగా ఆనందాన్నిచ్చే విషయం.
‘కుబేర’కు సీక్వెల్ ఉండదు. కథ అక్కడితో ఆగిపోతుంది. ఇక ‘లీడర్’కు సీక్వెల్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. అయితే అప్పటికీ ఇప్పటికీ సమాజం, పరిస్థితులు చాలా మారిపోయాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే సీక్వెల్ కథ రాయొచ్చు. నానితో సినిమా చేసే ఆలోచన ఉంది. అయితే ఇంకా కథ సిద్ధం చేయలేదు. ఆ సినిమాకు ఇంకా సమయం పడుతుంది.