సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ అని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమనికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లూడుతూ.. “ఈ కార్యక్రమానికి నేను ఒక మంత్రి హోదాలో రాలేదు. పవన్ కల్యాణ్‌గారు పిలిస్తే ఆయన సోదరుడిగా వచ్చాను. పవన్ కల్యాణ్ ఒక మంచి మనసున్న మనిషి. నా అభిప్రాయంలో సినిమా స్టార్లు, సూపర్ స్టార్లు చాలా మంది ఉంటారు.. కానీ ఒక విలక్షణమైన శైలి, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరే. ఆయనలాంటి విలక్షణమైన నటుడు అరుదు. నేను కూడా నా కాలేజీ రోజుల్లో తొలిప్రేమ సినిమా చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే దాదాపు 25 ఏళ్ల వరకు ఆయనకున్న స్టార్డమ్ చెక్కుచెదరలేదు. ఇది ఒక అసాధారణమైన విషయం. ఇన్నేళ్లపాటుగా ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకోవడం.. ఒక అసాధారణమైన విజయం. ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకుడు సాగర్‌తో టెక్నీషియన్లు అందరికీ నా శుభాకాంక్షలు” అని అన్నారు.
అలాగే గత ఎనిమిదేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. భారత చలన చిత్ర పరిశ్రమకి హైదరాబాద్ నగరాన్ని ఒక సుస్థిరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధృడసంకల్పంతో కృషి చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిలో పవన్ కల్యాణ్‌తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ సహకరించాలని ఆయన కోరారు. గోదావరి జలాలు ప్రవహించే కాళేశ్వరం ప్రాజెక్ట్.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల వద్ద కూడా షూటింగ్‌లు చేయవచ్చని కేటీఆర్ సూచించారు.