Kriti Sanon | ‘నేను ఏకాకిని కాదు. నాకు ఓ కుటుంబం ఉంది. నాపై తప్పుడు సమాచారం రాస్తే అది నా కుటుంబం మొత్తాన్ని బాధిస్తుంది. పైగా దాని దుష్ప్రభావాలు మేమంతా అనుభవించాలి. దయచేసి అబద్ధాలు రాయొద్దు ప్లీజ్.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అందాలభామ కృతి సనన్. యూకేకు చెందిన కబీర్ బహియాతో కృతి డేటింగ్లో ఉన్నదంటూ, పైగా అతను కృతి కంటే పదేండ్లు చిన్నవాడంటూ వస్తున్న వార్తలపై కృతి స్పందించింది.
‘సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతున్నది. అవి నిజాలైతే పర్లేదు. అబద్ధాలను వండి వారుస్తున్నారు. వాటినే నిజమని భావించి ఎంతోమంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. అబద్ధాలపై స్పందించాలంటే చిరాగ్గా ఉంది.
‘34ఏళ్ల కృతి తన కంటే పదేండ్లు చిన్న వ్యక్తితో డేటింగ్’ అని హెడ్డింగులు పెట్టేసి రాస్తున్నారు. దీనిపై ఆన్లైన్లో ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఓ ట్రెండ్ అయిపోయింది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, అవతలివారిపై గాలివార్తలు రాయడం.. రెండూ ఒకటి కాదు. అది గ్రహించండి’ అంటూ వాపోయింది కృతి సనన్.