Kriti Sanon | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన చలాకీతనం, సరదా స్వభావంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తెరపై ఎంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తుందో, నిజ జీవితంలో కూడా అంతే జోవియల్‌గా ఉంటుందని ఆమెతో పనిచేసిన పలువురు సెలబ్రిటీలు చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా రష్మిక వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కృతి సనన్, రష్మిక కలిసి కాక్టెయిల్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రష్మికతో కలిసి పనిచేసిన అనుభవాలను కృతి తాజాగా పంచుకుంది. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తే పోటీ, అభద్రతా భావం, ఈగో సమస్యలు ఉంటాయని ఇండస్ట్రీలో తరచూ చర్చ జరుగుతుంటుంది. కానీ రష్మిక విషయంలో మాత్రం అలాంటివి ఏమాత్రం కనిపించలేదని కృతి స్పష్టం చేసింది.
“రష్మిక సెట్స్‌లో ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరితో చాలా త్వరగా కలిసిపోతుంది. తనలో ఎలాంటి నెగెటివ్ భావనలు ఉండవు. పైగా ఇతరులను ప్రోత్సహిస్తూ సెట్స్ మొత్తాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపేస్తుంది” అంటూ కృతి ప్రశంసలు కురిపించింది. ఒక స్టార్ హీరోయిన్గా తన పాత్రపై ఎంత ఫోకస్ పెడుతుందో, తోటి నటీనటుల పాత్రలను కూడా అంతే గౌరవంగా చూసుకుంటుందని తెలిపింది. రష్మికలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందని కృతి చెప్పింది. షూటింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సరదాగా వాతావరణం సాగడానికి రష్మిక ప్రధాన కారణమని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా “రష్మిక నిజంగానే గోల్డెన్ హార్ట్ ఉన్న హీరోయిన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక కాక్టెయిల్ 2 విషయానికి వస్తే, ఈ సినిమా పై ఇప్పటికే బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ముఖ్యంగా కృతి సనన్-రష్మిక మందన్నాల కాంబినేషన్ తెరపై కొత్త ఫీల్ ఇవ్వబోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు మహిళా ప్రాధాన్యత కలిగిన కథలను కూడా ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది. ఇటీవల వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టిన తర్వాత రష్మిక మరింత ఆచితూచి కథలను ఎంపిక చేస్తోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక కృతి సనన్ వంటి స్టార్ హీరోయిన్ నుంచి రష్మికకు ఇలాంటి ప్రశంసలు రావడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమని అభిమానులు అంటున్నారు.