జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీరంగాన్ని కుదిపేస్తున్నది. ఈ కమిటీ ప్రభావంతో ఇతర భాషల్లో కూడా లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినీ రంగంలో ఈ పరిణామాలపై కథానాయిక కృతిశెట్టి ఆందోళన వ్యక్తం చేసింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ తరహా సంఘటనలు జరగడం దురదృష్టకరం.బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటే భయమేస్తున్నది. అయితే ఇలాంటి సంఘటనల గురించి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు ముందే తెలుసుకోవడం చాలా మంచిది. అప్పుడు వారికి ఇండస్ట్రీ పట్ల ఓ అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయి’ అని చెప్పింది.
వ్యక్తిగతంగా ఇలాంటి విషయాలు తనను బాగా డిస్డర్బ్ చేస్తాయని, వేధింపుల వార్తలు విన్నప్పుడు ఆందోళన కలుగుతుందని కృతిశెట్టి చెప్పింది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళలు ఆలోచించి అడుగులు వేయాలని ఆమె సలహా ఇచ్చింది. కృతిశెట్టి నటించిన తాజా చిత్రం ‘ఏఆర్ఎమ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నది.