Krishna Vamsi| పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అయితే ఈ ఆపరేషన్‌కి ఆపరేషన్ సిందూర్ పేరు పెట్టడం చర్చనీయాంశం అయింది. హిందూ మహిళలు తమ వివాహ స్థితిని సూచించడానికి నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే ఉగ్రదాడిలో 26 మంది మహిళల సిందూరం దూరం అయింది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకే భారత సైన్యం చేపట్టిన దాడికి ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ అని పెట్టినట్లు తెలుస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ సిందూరం అనే టైటిల్ తో 1997లో చిత్రాన్ని తెరకెక్కించారు. లో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా అంత హిట్ కాకపోయిన కృష్ణవంశీ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత నెటిజన్స్ సిందూరం చిత్ర పోస్టర్స్‌ని వైరల్ చేస్తూ కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తున్నారు.. ఓ నెటిజన్ ‘ఆలోచనల్లో కృష్ణవంశీ అందరికంటే ముందుంటారు అని సింధూరం చిత్ర పోస్టర్ ని, ఆపరేషన్ సిందూర్ తో కలిపి పోస్ట్ చేయగా, దానికి కృష్ణవంశీ… వందేమాతరం అని రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ ఇండియన్ ఆపరేషన్‌కి మీ సినిమా పేరు పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది ప్రశ్నించాడు. కృష్ణవంశీ అందుకు సమాధానం ఇస్తూ .. పర్ఫెక్ట్ నేమ్.. మోడీ గారి రియల్ హీరో.. ఇండియన్ ఆర్మీ కి నా సెల్యూట్.. వందేమాతరం.. ఐ లవ్ భారత్ అని సమాధానం ఇచ్చారు.
మరో నైటిజన్ మీ ఖడ్గానికి మన ఆర్మీ సిందూరం అద్దారు మీకు ఎలా అనిపిస్తుంది అని అడగ్గా మోడీ గారికి ఇండియన్ ఆర్మీకి నా కృతజ్ఞతలు.. వాళ్లని చూస్తే గర్వంగా ఉంది.. వందేమాతరం అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కృష్ణవంశీ రూపొందించిన సిందూరం, ఖడ్గం చిత్రాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఖడ్గం చిత్రంలో ఇండియా పాక్ గొడవలు, ఉగ్రవాదం నేపథ్యం చూపించి సూపర్ హిట్ కొట్టారు