‘కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి. ‘ఘాటి’ అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడి తీవ్రమైన భావోద్వేగాలు, మనుషుల గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. రచయిత చింతకింద శ్రీనివాసరావు ఈ ప్రపంచం గురించి నాకు చెప్పారు. ఎక్సైటింగ్‌గా అనిపించింది.
నా ‘వేదం’లో సరోజగా నటించిన అనుష్క, ‘ఘాటి’లో శీలావతిగా రాబోతున్నది. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ చేసిన అనుష్క కెరీర్లో మరో ఐకానిక్ క్యారెక్టర్ ‘ఘాటి’లోని శీలావతి పాత్ర. ఆమె నటవిశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. సెన్సార్‌కి ఇచ్చే ముందు కాపీ చూసుకొని తనకి ఫోన్ చేశాను. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పాను.
అదేమాట ఆడియన్స్‌కి కూడా చెబుతున్నా. సాంకేతికంగా అన్ని విధాలా ‘ఘాటి’ అద్భుతంగా ఉంటుంది. కననీ, విననీ పాత్రల్ని ‘ఘాటి’లో చూస్తారు. ‘ఘాటి’లో అందమైన సోల్ ఉంది. ఆడియన్స్ ఆ సోల్‌ని మనసులో నింపుకుని వెళ్తారు.’ అని దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఘాటి’.
అనుష్క లీడ్ రోల్ చేశారు. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా కనిపిస్తారు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో క్రిష్ మాట్లాడారు. స్వీటీ అనుష్క ఇందులో ఘాటుగా ఉండబోతున్నదని, రియల్ లొకేషన్స్‌లో తీసిన సినిమా ఇదని, క్రిష్ ఓ అద్భుతమైన సినిమా తీశాడని, ఇందులో ఓ డిఫరెంట్ పోలీస్‌గా కనిపిస్తానని జగపతిబాబు తెలిపారు. ఈ సినిమాలో భాగం అయినందుకు విక్రమ్ ప్రభు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చైతన్యరావు, నిర్మాత రాజీవ్‌రెడ్డి కూడా మాట్లాడారు.